ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మొదలైన రాజకీయ యుద్ధం ఇప్పుడు సీబీఐ-పోలీసుల మధ్య సరికొత్త సంఘర్షణకు ఆజ్యం పోసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌కు పోలీసులు సమన్లు పంపడంతో సోమవారం అనూహ్య మలుపు తిరిగింది. ఓ పాత కేసులో సాక్షిగా హాజరు కావాలంటూ సీబీఐ జాయింట్ డైరెక్టర్ (కోల్‌కతా జోన్) పంకజ్ శ్రీవాత్సవకు సమన్లు ఇచ్చారు. శ్రీవాత్సవ కార్యాలయానికి వెళ్లిన ముగ్గురు సభ్యుల పోలీసు బృందం నేర శిక్షాస్మృతిలోని 160 సెక్షన్ కింద ఆయనకు నోటీసు జారీ చేశారు. 45 లక్షల రూపాయల చీటింగ్‌కు సంబంధించిన పాత కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు భౌనిపోర్ పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని ఆ నోటీసులో ఆయన్ని కోరారు. ఇది హౌరాలో సీబీఐ కస్టడీ నుంచి ఓ నిందితుడు తప్పించుకు పారిపోవడానికి సంబంధించినది కేసు కావడం గమనార్హం.
కాగా, తనకు నోటీసు అందిందని, న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నానని శ్రీవాత్సవ తెలిపారు. నగర పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సరైన ఆధారాలతో సీబీఐ బృందం వచ్చినప్పటికీ, వారిని పోలీసులు అడ్డుకున్నారని, దురుసుగా ప్రవర్తించారని శ్రీవాత్సవ ఆరోపించారు. ఈ కారణంగానే ఓ పాత కేసును తిరగదోడి మరీ ఆయనకు పోలీసులు నోటీసు జారీ చేయడం గమనార్హం.