ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ కన్నుమూత.

0
263

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ (48) గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఇటీవల  త్రిసూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారాయన.  ఆరోగ్యం విషమించడంతో  తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖప్రజ్ఞాశాలిగా మలయాళ చిత్రసీమలో సచీ  గుర్తింపును సొంతం చేసుకున్నారు.  ఆయన అసలు పేరు కె.ఆర్‌ సచ్చిదానందన్‌. కేరళ హైకోర్టులో  క్రిమినల్‌ లాయర్‌గా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన సచీ కళలు, కథా రచనపై మక్కువతో చిత్రసీమలో అడుగుపెట్టారు. చాకోలెట్‌, రాబిన్‌హుడ్‌, మేకప్‌మ్యాన్‌, సీనియర్స్‌, డబుల్స్‌ చిత్రాలకు సేతునాథ్‌ కలిసి సచీ రచయితగా పనిచేశారు. 2012లో ‘రన్‌ బేబీ రన్‌’ సినిమాతో సోలో రైటర్‌గా మారిన ఆయన పలు విజయవంతమైన చిత్రాలకు కథలు, సంభాషణలు అందించారు.

‘అనార్కలి’ సినిమాతో దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టిన సచీ తొలి అడుగులోనే పెద్ద విజయాన్ని అందుకున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజుమీనన్‌ కథానాయకులుగా సచీ దర్శకత్వంలో రూపొందిన ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్‌’  లాక్‌డౌన్‌కు ముందు విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.  ఈ   ఏడాది మలయాళ చిత్రసీమలో అతిపెద్ద విజయంగా నిలిచింది. సచీ మరణంతో మలయాళ చిత్రసీమ విషాదంలో ముగినిపోయింది. ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయితను సినీ పరిశ్రమ కోల్పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు.  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, నివీన్‌ పాల్‌తో పాటు పలువురు నటులు సచీకి నివాళులు అర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం సచీ అంత్యక్రియల్ని  నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.