భారత్‌లో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు.

0
218

రోజురోజుకు భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా నాలుగు లక్షలకు చేరువలో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల్లో 14516 పాజిటివ్ కేసులు రావడంతో… మొత్తం కేసుల సంఖ్య దాదాపు 4లక్షలకు దగ్గరవుతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకు మొత్తం 3,95,048 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో మరో 375 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12,948కు పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 2,13,831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇదే సమయంలో… నిన్న 9120 మంది రికవరీ అవ్వడంతో… మొత్తం రికవరీ కేసుల సంఖ్య 213830కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసులు 168269గా ఉన్నాయి. మన దేశంలో రికవరీ రేటు 54.1 శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా… ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. ప్రధానంగా ఇండియాలో మహారాష్ట్ర (124331), తమిళనాడు (54449) ఢిల్లీ (53116) కేసులున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కేసులు 50 వేలను దాటేశాయి. మహారాష్ట్రలో ఏకంగా లక్ష దాటేశాయి. ఫిబ్రవరిలో జస్ట్ 3 కేసులుండే ఇండియా… నాలుగు నెలల్లో 4 లక్షలకు చేరువవడం మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి.

మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 499 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 129 కేసులు రికార్డ్ అయ్యాయి.