ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వైఎస్ జగన్.

0
272

ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాట్లు చేశారు. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఒక్కొక్క స్థానానికి కనీసం 34 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ కేటాయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేసిందీ బ్యాలెట్‌ను పార్టీ నిర్దేశించిన ప్రతినిధికి చూపించి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అయినా పొరబాటున ఓటు వేసిన బ్యాలెట్‌ పత్రాన్ని తమ పార్టీ ప్రతినిధికి కాక మరొకరికి చూపిస్తే ఆ ఓటు చెల్లదు.

ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి బరిలో ఉన్నారు.. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీకి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏజెంట్‌లుగా ఉన్నారు. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్‍బాబును.. పార్టీ తరపున ఏజెంట్‍గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉండనున్నారు.