తల్లయ్యాక మీరు చాలా లావయ్యారు అంటూ బాడీ షేమింగ్ చేసిన ఓ మహిళా రిపోర్టర్‌కు బాలీవుడ్ నటి నేహా ధూపియా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక తల్లిగా తనకు కూతురే ప్రథమ ప్రాధాన్యం అని.. మిగిలిన విషయాలన్నీ ఆమె తర్వాతే అంటూ మాతృత్వాన్ని చాటుకున్నారు. ‘ ఫ్యాట్ షేమింగ్ అనే జాడ్యం సెలబ్రిటీ తల్లులనే కాదు సాధారణ తల్లులను కూడా బాధిస్తోంది. అయితే నేను ఈ విషయం గురించి చింతించను. నా కూతురి కోసం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రోజుకు రెండుసార్లు వర్కౌట్ చేస్తున్నాను. ప్రస్తుతం నాకు ఫిట్‌నెస్ మాత్రమే ముఖ్యం. ఈ సమాజం చూసే చూపుల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇక నుంచైనా ఇలాంటి క్రూరమైన కామెంట్లు చేయకండి. కాస్త దయాగుణం కలిగి ఉండండి’ అంటూ నేహా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు.
కాగా బాడీషేమింగ్ పట్ల నేహా స్పందించిన తీరును సెలబ్రిటీలు సహా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘నేహా నువ్వు నిజంగా అద్భుతమైన మహిళవి. ఎన్నో సవాళ్లను చిరునవ్వుతో, తెలివితో ఎదుర్కొన్నావు. లావు పెరగడం కాదు ఇక్కడ అసలు సమస్య. మన ఆలోచనా దృక్పథంలో మార్పు రావడం ముఖ్యం. ఆ మహిళకు ఏదో ఒకరోజు కనువిప్పు కలుగుతుంది’ అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశాడు. ‘మీరు గొప్ప అమ్మ. మహిళల శరీరాన్ని, బాహ్య సౌందర్యాన్నిమాత్రమే చూసే వ్యక్తుల గురించి అసలు పట్టించుకోకపోవడమే మంచిది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక గతేడాది మే నెలలో తన స్నేహితుడు అంగద్ బేడీని పెళ్లి చుసుకున్న నేహా ధూపియా ఇటీవలే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.