కీబోర్డు, మౌస్‌తో ఒకేరకమైన కదలికలతో కూడిన పనులను ఎక్కువసేపు, తరచుగా చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వంటి వారిలో ఇది ఎక్కువగా కనబడుతుంది. ఇలాంటి పనులు చేసేవారిలో మణికట్టు ముందుకు వంగి పోతుండటం, వేళ్లు అదేపనిగా కదులుతూ ఉండటం సమస్యకు దారితీస్తుంది. మన చేతి ఎముకల్లో చిన్న సొరంగం లాంటిది ఉంటుంది. దీన్నే కార్పెల్ టన్నెల్ అంటారు. కీలకమైన మీడియన్ నాడి దీని గుండానే అరచేతిలోకి వస్తుంది. ఈ సొరంగంలో పీడనం పెరిగితే.. నాడి నొక్కుకుపోయి సమస్య మొదలవుతుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. కంప్యూటర్ కీబోర్డు మీద తరచూ వేగంగా వేళ్లను కదిలించటం వల్ల సైనోవియం పొర మందంగా తయారు కావటం కూడా దీనికి కారణం కావొచ్చు. దీంతో మణికట్టు, వేళ్లు నొప్పి పుట్టటం, మొద్దుబారటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి.
మణికట్టు దగ్గర మీడియన్ నాడిని కొద్దిగా నొక్కితే ఈ లక్షణాలు వెంటనే తీవ్రమవుతుంటాయి కూడా. సమస్యను గుర్తించటానికి ఇది తేలికైన పరీక్ష. అవసరమైతే నాడుల పనితీరును తెలిపే పరీక్ష చేయాల్సి ఉంటుంది. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి వేళ్లను, మణికట్టును సాగదీసే వ్యాయామాలతో మంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో ఫలితం కనబడకపోతే నొప్పి నివారణ మందుల వంటివి ఉపయోగపడతాయి. అవసరమైతే మణికట్టు దగ్గరి సొరంగంలోకి ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. వీటితో ఎలాంటి ఫలితమూ కనబడకపోతే చివరి ప్రయత్నంగానే సర్జరీ చేయాల్సిన అవసరముంటుంది. దీంతో సమస్య పూర్తిగా తగ్గుతుంది. మీరు మోకీళ్ల నొప్పులు, మడమల నొప్పులని కూడా అంటున్నారు కాబట్టి కీళ్లవాతం (రుమటాయిడ్) సమస్య ఏదైనా ఉందేమో కూడా చూసుకోవాలి. ఎందుకంటే కీళ్లవాతం, ఆర్థ్రయిటిస్ వంటి సమస్యలూ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌కు దారితీయొచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఎముకల నిపుణులను, కీళ్లవాతం నిపుణులను సంప్రతించటం మంచిది. అప్పుడే సమస్యను కచ్చితంగా నిర్ధరించి చికిత్స చేయటానికి వీలుంటుంది.