తెరాస కీలక నేత, సిద్ధిపేట శాసన సభ్యులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు తన్నీరు హరీష్‌రావు చుట్టూ ఏం జరుగుతోంది?. క్రమక్రమంగా పార్టీలో ఆయన ప్రాబల్యాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందా?. తనయుడు కేటీఆర్ కోసం… మేనల్లుడు హరీష్ రాజకీయ జీవితాన్ని కేసీఆర్ సమాధి చేయబోతున్నారా?. సిద్ధిపేటలో అనూహ్య మెజారిటీని సాధించి దేశంలోనే తొలి నేతగా అవతరించిన హరీష్‌రావును ఎమ్మెల్యేగా రాజీనామా చేయించి ఎంపీగా పార్లమెంట్‌కు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం అత్యధిక శాతం ఎమ్మెల్యేల్లో వినిపిస్తోంది. కానీ ఎవరూ ఎదురుచెప్పే సాహసం చేయడం లేదు.
స్థానిక పదవుల నుంచి తప్పించి మాస్ లీడర్ అయిన హరీష్‌రావును ఎంపీగా పార్లమెంట్‌కు పంపించి తనయుడు కేటీఆర్ కు అడ్డులేకుండా చేయాలన్నదే కేసీఆర్ అసలు ఎత్తుగడగా చెబుతున్నారు. అలా చేయని పక్షంలో హరీష్‌రావు మరో చంద్రబాబుగా మారతాడని, దాంతో తాను మరో ఎన్టీఆర్ ని కాక తప్పదన్నది కేసీఆర్ భయం అని చెబుతున్నారు. అందులో భాగంగానే గత కొంత కాలంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)కు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పదవికి రాజీనామా చేశారట. ఇంతేనా తనకు కేటాయించిన మినిస్టర్ బంగళాను కూడా రీసెంట్‌గా ఖాలీ చేయడంతో ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్టుగా తెలుస్తోంది.
అయితే హరీష్‌రావులో అసహనం పెరిగితే తిరుగుబాటు తప్పదని, ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు చేసిందే హరీష్‌రావు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు కారణంగా పరిణమించే అవకాశం లేకపోలేదని, హరీష్‌రావుని రాజకీయాంగా తొక్కుతుండటం ఆయన వర్గానికి ఆగ్రహాన్ని తెప్పిస్తోందని వినిపిస్తోంది. ఒక్కసారిగా వారి ఆగ్రహాం కట్టలు తెంచుకుంటే తెలంగాణ కొత్త రాజకీయ చదరంగానికి వేదిక కాక తప్పదు. రాజకీయ క్రీడలో పండిపోయిన కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి ఎత్తులు వేస్తారో?.ఈ కథ ఏ కంచికి చేరుతుందో అన్న చర్చ సాగుతోంది.