చాలామంది గ్యాసు, ఎడిసిటీ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వాటికి మాత్రలు వేసుకోవడం కన్నా… పవన ముక్తాసనాన్ని ప్రయత్నించి చూడండి.
ఎలా వేయాలంటే: మొదట యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్లు ఎత్తి మోకాళ్ల దగ్గర మడిచి పొట్టకు ఆనించాలి. చేతుల్ని కాళ్ల చుట్టూ తిప్పి పొట్టకు ఆనేలా వీలైనంత నొక్కి పెట్టాలి. ఇలా ముప్ఫై సెకన్ల వరకు ఉండాలి. శ్వాస సామాన్యంగా తీసుకోవాలి. రెండు మూడు నిమిషాల వరకూ ఉండగలిగితే మంచిది.
జాగ్రత్తలు: రెండు కాళ్లతో చేయలేనివారు ఒక్కో కాలితో చేయొచ్చు. నడుమునొప్పి విపరీతంగా ఉంటే చేయకూడదు. నెలసరి సమయంలో కూడా ఈ ఆసనం వేయకూడదు.
లాభాలు: పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గుతాయి. గ్యాసు, ఎసిడిటీ తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వు కూడా తగ్గుతుంది. నడుము నొప్పి, సయాటికా, గర్భాశయ సంబంధ సమస్యలు, హృద్రోగాలకు ఇది మంచి ఆసనం.
ఈ ఆసనంతోపాటు పొట్ట తగ్గడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.
* ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి.
* ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. భోజనం చేస్తున్న సమయంలో నీళ్లు తాగకూడదు.
* వేపుళ్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ వీలైనంత వరకూ తగ్గించాలి.
* ఒకేరకమైన వంట నూనెలు కాకుండా మార్చాలి.
* పొట్టలో సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే సమయంలో శుద్ధి చూర్ణం లేదా త్రిఫల చూర్ణం గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే… మంచి ఫలితం ఉంటుంది.