విశాఖ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫస్ట్ టీ-20లో టీమిండియా ఓటమిపాలైంది. పర్యాటక జట్టు చేతిలో మూడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. 127 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి చేధించారు. ఫలితంగా కంగారూల జట్టు విజయ కేతనం ఎగుర వేసింది. తాజాగా బుధవారం జరిగిన రెండో టీ-20లోనూ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
ఆస్ట్రేలియాతో బుధవారం బెంగళూరులో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. రాహుల్ 47, కోహ్లీ 72, ధోనీ 40 పరుగులు చేశారు. అనంతరం, లక్ష్యఛేదనలో ఆసీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే విజయభేరి మోగించింది.
ఆసీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మ్యాక్స్ వెల్ 55 బంతుల్లో 113 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. హ్యాండ్స్ కోంబ్ 20 పరుగులు సాధించాడు. దాంతో రెండు టి20ల సిరీస్‌ను ఆసీస్ 2-0తో గెలుచుకుంది.