అనిల్ అంబానీకి జైలు తప్పదా?

Refuse to believe Rcom will let Anil Ambani go to jail

0
56
Anil Ambani
Anil Ambani

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీకి జైలు తప్పేట్లు లేదు. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో నిధుల సమీకరణకు అనిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. తమ ఖాతాల్లో ఉన్న ఆదాయం పన్ను (ఐటీ) రిఫండ్స్ సొమ్మును విడుదల చేయాలన్న ఆర్‌కామ్ పిటిషన్‌పై ఆదేశాలను నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిలుపుదలలో పెట్టింది.

ఆర్‌కామ్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్లు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్న చైర్‌పర్సన్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం.. బుధవారం తమ ఆదేశాన్ని రిజర్వ్‌లో పెట్టింది.

దీంతో ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడకుండా పోయింది. కాగా, ఎరిక్సన్‌కు రూ.550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీంకోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని హెచ్చరించిన సంగతీ విదితమే. అయితే ఇప్పటికే రూ.118 కోట్లు చెల్లించినందున, మిగతా మొత్తాన్నివ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దీంతో తమ ఖాతాల్లో ఉన్న ఐటీ రిఫండ్స్ సొమ్మును బకాయిల చెల్లింపునకు వినియోగించుకోవాలని ఆర్‌కామ్ భావించింది. కానీ సంస్థ దివాలా ప్రక్రియలో ఉన్నందున ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ఆర్‌కామ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, రుణదాతల తరఫున మరో సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదిస్తున్నారు.