ఏపీలో వైసీపీదే గెలుపు.. దొంగబాబు అలా పారిపోయారు.. తలసాని

0
111
talasani
talasani

కాంగ్రెస్ నేతలకు తమ పార్టీ నడపడం చేతకాక తమపై పడి ఏడుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు దద్దమ్మల్లా మారారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్నారు.

ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన విరుచుకుపడ్డారు. మతాన్ని నమ్ముకుని, అమ్ముకుని ఓట్లు అడిగే పార్టీ బీజేపీ అని, దేశానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని దుమ్మెత్తి పోశారు.

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ గెలిస్తే, కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన వాటిని తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పనిలో పనిగా ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించబోతోందని తలసాని జోస్యం చెప్పారు. అదే విధంగా, 22 నుంచి 23 లోక్ సభ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు చరిత్ర తన దగ్గర ఉందని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ బాబు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక చేరుకునేది హైదరాబాద్‌లోని ఆయన ఇంటికేనని సెటైర్లు విసిరారు.