జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పేపర్, ఛానల్ ఉన్నాయని పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తానని పవన్ హెచ్చరించారు. కైకలూరులో పవన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్, విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు.
పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదన్నారు. నోటికి వచ్చినట్టు విజయసాయి మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. రాజకీయాలు జగన్, చంద్రబాబులే చేస్తారా? తాను చేయలేనా? అని నిలదీశారు. కేసీఆర్ అనుమతితోనే వైసీపీ బీ-ఫారాలు అందజేస్తోందని పవన్ విమర్శలు గుప్పించారు. త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, కొత్తతరం రాజకీయాలను తీసుకొస్తానని పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాకిస్థాన్‌లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.