ప్రియాంకా గాంధీకి అగ్నిపరీక్ష

0
63

కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం ప్రియాంకా గాంధీ వాద్రా. ఈమె ఈనెల ఆరో తేదీన అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. దీనికి కారణం ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పూర్వాంచల్‌లో ఐదో దేశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం స్థానాలు 20 కాగా, మే 6వ తేదీన వాటిలోని 14 సీట్లకు పోలింగ్‌ జరగబోతోంది.

ఇందులో గాంధీ కుటుంబ నియోజకవర్గాలు అమేఠీ, రాయ్‌బరేలీ కూడా ఉన్నాయి. గత దశాబ్దంన్నర కాలంగా ఈ రెంటికీ ప్రియాంకే కాంగ్రె స్‌ ఎలక్షన్‌ ఇన్‌ఛార్జి. ఈసారి మిగలిన సీట్లలోనూ ఆమె పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన పరిస్థితి. అమేథీ, రాయ్‌బరేలీలను తీసేస్తే… ఇక్కడ మిగిలిన పార్టీల్లో బలంగా ఉన్నవి బీజేపీ, బీఎస్పీ. సమాజ్‌ వాదీ పార్టీ కూడా ఉన్నా బీఎస్పీ కంటే బలం తక్కువే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి నుంచి ఎస్పీ-బీఎస్పీలు తమను పక్కన పెట్టాక తన సత్తా చాటాలన్న పట్టుదల కాంగ్రెస్ పార్టీలో పెరిగింది. దీంతో ఈసారి చాలా గట్టి అభ్యర్థులను అన్ని చోట్లా కాంగ్రెస్‌ నిలబెట్టింది. ఎస్పీ-బీఎస్పీల్లో సగం ఆందోళనకు కారణమిదే. రెండ్రోజుల కిందట రాయ్‌బరేలీలో ప్రియాంక ఓ వ్యాఖ్య చేశారు. ‘మేం బలంగా ఉన్న చోట్ల మేమే గెలుస్తాం. లేని చోట్ల మేం నిలబెట్టిన అభ్యర్థులు బీజేపీ ఓటుబ్యాంకును చీలుస్తారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ఎస్పీ-బీఎస్పీలకు ఈ వ్యాఖ్య రుచించలేదు. ‘ఈ వ్యాఖ్యలను నమ్మలేమనీ, ఎవరూ బలహీన అభ్యర్థులను నిలబెట్టరనీ’ అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఆయన మాటల అంతరార్థం… కాంగ్రెస్‌ అభ్యర్థులు బీజేపీ ఓటు బ్యాంకునే గాక తమ ఓటుబ్యాంకును కూడా చీల్చేంత స్థాయి ఉన్నవారన్నది! అటు మాయావతి కూడా ‘బీజేపీతో కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యింది… బీజేపీకి లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్‌ లక్ష్యం’ అని ఆరోపించారు. అఖిలేశ్‌ కూడా దాదాపుగా ఇదే ఆరోపణ చేశారు.

దీంతో ప్రియాంకా గాంధీ వివరణ ఇచ్చారు. ‘అన్నిచోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులంతా బలమైనవారేనని’ స్పష్టం చేశారు. అంతేకాక.. చావనైనా ఛస్తాను గానీ బీజేపీకి మాత్రం లబ్ధి చేకూర్చబోమని తీవ్రంగా అన్నారు. ఆమె ఇచ్చిన ఈ వివరణ కూటమికీ, కాంగ్రెస్ పార్టీకి మధ్య అంతరానికీ, పూర్వాంచల్‌లో ఎన్నికల వేడికీ అద్దం పడుతోంది.

ఇకపోతే, అమేథీ, రాయ్‌బరేలీ తప్ప దాదాపుగా మిగిలిన 12 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ అనివార్యమయ్యింది. గత ఎన్నికల్లో ఈ 14 నియోజకవర్గాల్లో అమేథీ, రాయబరేలీ తప్ప మిగతా 12 నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ సారి ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాక ధౌరాహ్ర, బారాబంకీ, ఫైజాబాద్‌, సీతాపూర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గట్టి పోటీనిస్తోంది.

2009లో ఈ 14 సీట్లలో కాంగ్రెస్‌ 7 గెలుచుకున్న రీత్యా కాంగ్రెస్ పార్టీని అంత తేలిగ్గా కొట్టిపారేసే పరిస్థితులు లేవు. 2014లో 10 సీట్లలో ఎస్‌పీ లేదా బీఎస్పీ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిస్తే మెజారిటీ స్థానాల్లో అవి బీజేపీ ఓట్లను దాటేశాయి. కానీ కాంగ్రెస్‌ గట్టి పోటీనిస్తుండడంతో ఓట్ల చీలిక అనివార్యమై అది చివరకు బీజేపీకి లాభం చేకూర్చినా చేకూర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.