వేసవికాలంలో చెమట కాయల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎండలో తిరిగినా, ఎక్కువగా ఉక్కబోసినట్లు అనిపించే వాతావరణంలో ఉన్నాగాని ఈ సమస్య మొదలవుతుంది. ఉపశమనం పొందాలన్న అవి రాకుండా మనం పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి.
* వేసవిలో చర్మంపై వచ్చే చెమటకాయల్నే పేలడం అంటాం. ఇవి చర్మంపై ఎరుపు రంగు చుక్కలు, నీటి పొక్కులుగా వస్తాయి.
* చిన్న పిల్లల్లో, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి, అధిక బరువున్న వారికి, చెమట ఎక్కువగా పట్టేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
* వీటివల్ల దురద, మంట వంటివీ ఎదురవుతాయి. అవి రాకుండా కొన్ని చిట్కాలు పాటించాలి.
* మన మెడమీద, వీపుమీద, ముఖం, కాళ్ల మడతల్లో, కొవ్వు ఎక్కువగా ఉండే భాగాల్లో చెమట కాయలు ఏర్పడతాయి. వీటిని అశ్రద్ధ చేస్తే, అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉంది.
* వేసవిలో రెండు పూటలా స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేయడం, లేదా తడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకోవడం లాంటివి తప్పనిసరిగా చేయాలి.
* నీళ్లు ఎక్కువగా తాగాలి. దాంతో శరీరం చల్లగా ఉంటుంది. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి. వదులుగా ఉండే పల్చని కాటన్ దుస్తులే ధరించాలి.
* పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చని మజ్జిగ వంటి చలువ చేసే పదార్థాలే ఎక్కువగా తీసుకోవాలి.
* ఉప్పు, కారం, గరం మసాలా, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు లేదా వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం చేయడం వలన మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.