మంత్రి పదవికి రాజీనామా చేసిన కిడారి శ్రావణ్

0
80

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ తక్షణం ఆమోదించారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో శ్రావణ్‌ ప్రాథమిక వైద్యం, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. అరకు ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వర రావును నక్సల్స్‌ హత్య చేయడంతో ఆయన కుమారుడైన శ్రావణ్‌ను చంద్రబాబు గత యేడాది నవంబరు 11న తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.

అప్పటికి ఆయన ఉభయ సభల్లోనూ సభ్యుడు కాదు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభ నుంచి సభ్యుడిగా ఎన్నిక కావలసి ఉంది. కానీ ఇరు సభల్లో ఖాళీలు లేకపోవడంతో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావణ్‌ కుమార్ విశాఖ జిల్లా అరకు నుంచి పోటీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ’50 ఏళ్లకే గిరిజనులకు పెన్షన్లు ఇవ్వాలన్నది నా తండ్రి సర్వేశ్వరరావు ఆశయం. నేను గిరిజన మంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. తండ్రి ఆశయాన్ని నెరవేర్చానని సంతృప్తి ఇచ్చింది’ అని శ్రావణ్ చెప్పుకొచ్చారు.