ప్రధాని నరేంద్ర మోడీ తల్లిదండ్రులను అవమానించేలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తాను ప్రాణాలు వదిలివేస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధానులైన దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.
ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆవేదనగా ఉందన్నారు. తాను మోడీ తల్లిదండ్రులను అవమానించాల్సిన పరిస్థితే వస్తే, దానికంటే చనిపోవడానికే ఇష్టపడతానని రాహుల్ స్పష్టం చేశారు.
ద్వేషాన్ని వెదజల్లేందుకు తానేమీ బీజేపీ, ఆరెస్సెస్ నుంచి రాలేదన్నారు. ఉజ్జయినిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ, బీజేపీని ప్రేమతోనే మట్టి కరిపిస్తుందని జోస్యం చెప్పారు.
కాగా, ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ, వాస్తవ అంశాలను పక్కనబెట్టి మామిడి పండ్లు, మేఘాల గురించి మాట్లాడతారని రాహుల్ ఎద్దేవా చేశారు. మామిడి పండ్లు ఎలా తినాలో చెబుతారు కానీ నిరుద్యోగ యువతకు, దేశానికి ఏం చేశారో చెప్పరని విమర్శించారు.