కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ మాత్రం బాధ్యతలు చేపట్టరాదనీ, ఇందుకోసం రాహుల్ గాంధీ సైతం ఆ పదవికి దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇందుకోసం నరేంద్ర మోడీకి ససేమిరా అనేట్లుగా అన్ని రాజకీయ పక్షాలనూ ఒప్పించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
పనిలో పనిగా రాహుల్‌కి ప్రధాని అభ్యర్థిగా సర్వామోదం సాధించాలన్న ప్రయత్నమూ సాగుతుందని అంటున్నారు. అది సాధ్యపడని పక్షంలో కర్ణాటక తరహా ఫార్ములాను అమలు చేయాలని భావిస్తోంది. దీనిపై పార్టీలకొచ్చే సీట్ల సంఖ్యను బట్టి అంతా నిర్ణయం తీసుకుంటారు. యూపీలో మాయావతి 38 సీట్లకు పోటీచేశారు. ఇందులో ఎన్ని సాధిస్తారన్నది ముఖ్యమే అయినా తనకు ఎస్పీ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందన్న అంచనాలో ఆమె ఉన్నారు.
ఇదే తనను ఢిల్లీ గద్దెపై కూర్చోపెడుతుందన్న నమ్మకమూ ఆమెది. మమతా బెనర్జీ గతంలో మాదిరిగా మెజారిటీ స్థానాలు సాధించకపోవచ్చని, బీజేపీ అనేకచోట్ల ఆమె జైత్రయాత్రకు గండికొట్టబోతోందని ఓ సర్వే అంచనా. ఇదే నిజమైతే ప్రధాని అభ్యర్థిగా ఆమె అవకాశాలూ సన్నగిల్లుతాయి. శరద్‌పవార్ తాను రేసులో లేనని చెబుతున్నప్పటికీ ఓ అనూహ్య ప్రత్యామ్నాయంగా తెరపైకొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని వినిపిస్తోంది.