హోలీ-ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి పాక్‌స్థాన్‌లో ఏం చేశారంటే?

0
60

పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల మీద తరచూ దాడులు, బలవంతపు మతమార్పిడి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, హోలీ సందర్భంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి మతమార్పిడి జరిపించి ఆపై వివాహం చేసిన ఘటన పాకిస్థాన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తీవ్రస్థాయిలో సీరియస్ కావడం.. దృష్టి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. సింధ్ ప్రావిన్స్‌లోని గోట్కీ జిల్లాలో నివసించే రీనా (15), రవీనా (13) అక్కాచెల్లెళ్లు. కొందరు వ్యక్తులు హోలీ రోజున వారి ఇంటి నుంచే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే, ఆ తర్వాత వారికి వివాహలు జరిపిస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో పాక్‌లో ఉన్న హిందూ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లిళ్లు చేశారంటూ ఆరోపణలు వినిపించాయి.

కానీ, ఆ వీడియోలో రీనా, రవీనా మాట్లాడుతూ, తమను ఎవరూ బలవంతం చేయలేదని, తమ ఇష్టపూర్వకంగానే ఇస్లాం మతం స్వీకరించి వివాహలు చేసుకున్నామంటూ చెప్పడం కనిపించింది. దీనిపై హిందువులు భగ్గుమన్నారు.

రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో విషయం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరకు వెళ్లింది. ఆయన ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని సంబంధిత మంత్రిత్వశాఖను ఆదేశించారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్పందించారు. పూర్తి వివరాలు అందించాలంటూ పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్‌ను కోరారు.