తొలి తీవ్రవాది హిందువే : కమల్ హాసన్

0
70

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సేను తొలి తీవ్రవాదిగా అభివర్ణించారు.

తమిళనాడులోని కరుర్ జిల్లా అరవకురిచి పట్టణంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది ఓ హిందువని, అతడే మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సే అని గుర్తుచేశారు.

ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడ్డాను కాబట్టే ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఓ హిందువు. అతడే నాథూరామ్ గాడ్సే. అక్కడి నుంచే తీవ్రవాదం మొదలైంది అని చెప్పారు.

తాను గాంధీజీకి మనుమడి వంటివాడినని, ఆయన హత్యపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు కోరేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. నిజమైన భారతీయులు త్రివర్ణ పతాకంలోని రంగులను, వాటి వెనుక ఉన్న విశ్వాసాలను చెక్కుచెదురకుండా కాపాడుకుంటారన్నారు.

కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడింది. ఆయనపై ఐదురోజుల ప్రచార నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి (ఈసీకి) విజ్ఞప్తిచేసింది. మరోవైపు కమల్‌ హాసన్‌కు కాంగ్రెస్‌ పార్టీ, ద్రవిడర్ కళగంలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.