ఉగ్రవాదానికి మతం లేదు సర్.. కమల్‌కు వివేక్ ఒబెరాయ్ ట్వీట్

0
67

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ చేసిన ‘హిందూ ఉగ్రవాది’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తమిళనాడులోని అరవకురిచ్చిలో జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది ఓ హిందూ అంటూ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ప్రస్తావించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కూడా స్పందించారు. ‘కమల్ సర్, మీరు చాలా గొప్పనటులు, కానీ ముస్లింల ఓట్ల కోసం ఇలా మాట్లాడతారా?’ అంటూ కమల్‌ను నిలదీశారు.

“కళకు ఎలా మతం ఉండదో ఉగ్రవాదానికి కూడా మతం ఉండదు సర్, మీరు గాడ్సేని ఉగ్రవాది అంటూనే హిందూ అంటూ మతం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. మీరు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఓట్ల కోసమే మాట్లాడినట్టుగా అనిపిస్తోంది” అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఉగ్రవాదం ఎప్పటికీ భారత్‌ను చీల్చలేదని, దేశాన్ని విభజించే వ్యాఖ్యలు ఎవరూ చేయరాదని వివేక్ హితవు పలికారు. కమల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుంటే.. కాంగ్రెస్, ద్రావిడర్ కళగం వంటి పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.