జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ (జేపీ) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీల గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని.. వ్యక్తుల గురించి కూడా పెద్దగా స్పందించనని జేపీ తెలిపారు.
అయితే పవన్ మాత్రం చిత్తశుద్ధి గల మనిషి అని జేపీ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, చిత్తశుద్ధి గల మనిషి అంటూ వ్యాఖ్యానించారు. పవన్ చిత్తశుద్ధితో వున్నారనే విషయాన్ని ఏ వర్గమైన విశ్వసిస్తుందని గుర్తు చేశారు.
అన్నీ పార్టీల్లోనే మంచి, చెడూ రెండు వున్నాయని.. అంతేగానీ.. పార్టీల అంతర్గత వ్యవహారాల గురించి తాను నోరువిప్పదలచుకోలేదని జేపీ వ్యాఖ్యానించారు. సమాజంలో మంచి జరగాలని కోరుకునే వారు చాలామంది వున్నారు. మంచికోసం ఎవరు ముందుకొచ్చినా.. పార్టీలతో ప్రమేయం లేకుండా మనం మద్దతు ప్రకటించాల్సి వుంటుందని జేపీ తెలిపారు. కుటుంబ పాలనపై జేపీ స్పందిస్తూ.. దేశంలో మధ్య యుగాల రాజకీయం నడుస్తుంది.
మన ప్రజాస్వామ్యం అపరిపక్వ ప్రజాస్వామ్యం. ఇందుకు రెండే లక్షణాలున్నాయి. ఒకటి ఓటు. మంచికో చెడుకో ఓటు వేయడం పాలకులను ఎంచుకోవడం. శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతుంది. రెండోది అరిచే హక్కు. ప్రజల్లోకి వెళ్లి ఏమైనా మాట్లాడొచ్చు, బూతులు తిట్టొచ్చు. రాస్తారోకోలు చేయొచ్చు. ఈ రెండు తప్ప నిజమైన ప్రజాస్వామ్య లక్షణాలు మనకేం లేవు. ఇలాంటి వ్యవస్థలో అధికారమే పరమావధి అవుతుంది.
ఎవరి చేతులో పెత్తనం వుంటుందో వారికి సంబంధించిన వాళ్లే అధికారం చుట్టువుంటారు. మిగతా వాళ్లంతా పక్కనే చూస్తు నిల్చుండిపోతారు. పార్టీ, ఎన్నికల వ్యవస్థలో కొన్ని పద్దతులు ఏర్పాటు చేసుకోకుండా.. కేవలం పార్టీ నాయకుల్ని రాజులుగా, కంపెనీ ఓనర్లుగా, అదీ వాళ్ల సొంత ఎస్టేట్‌లా, వాళ్ల ఆస్తిలాగా భావిస్తున్నారు.
అందుకే ఏ పార్టీ మారినా పరిస్థితులు మారట్లేదని జేపీ వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం పార్టీలతో పనిలేదని.. మంచి కోసం ఎవరొచ్చినా మనం మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిలో వున్నామని జేపీ చెప్పుకొచ్చారు.