సరైన ఆహారం: శారీరక ఆరోగ్యానికి సమతులాహారం తీసుకోవాలన్నది తెలిసిందే. కానీ మెదడుకు మేలు చేసే ఆహారం గురించే మనం అంతగా పట్టించుకోం. మెదడు సరిగా పనిచేయటానికి మంచి కొవ్వులు, తేలికైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, గింజపప్పులు (నట్స్), ధాన్యాలు అధికంగా తీసుకోవటం మేధస్సుకు ఎంతో మేలు చేస్తుంది. సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకునేవారికి డిమెన్షియా వచ్చే ముప్పు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వెన్నకు (బటర్) బదులుగా పొద్దు తిరుగుడు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు.. మాంసానికి బదులు తేలికైన ప్రోటీన్లతో కూడిన చికెన్, చేపల వంటివి తీసుకోవటం మంచిది. బాదం వంటి గింజపప్పుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు సైతం మెదడు పోషణకు తోడ్పడతాయి.
దీర్ఘకాల జబ్బుల అదుపు: అధిక రక్తపోటు, మధుమేహం.. రెండూ డిమెన్షియాకు పెద్ద ముప్పులు. మధుమేహులకు డిమెన్షియా వచ్చే అవకాశం 73% ఎక్కువ. మధ్యవయసులో అధిక రక్తపోటు సైతం దీని ముప్పును పెంచుతుంది. కాబట్టి వీటికి సరైన చికిత్స తీసుకోవటం.. ఆహార, వ్యాయామ నియమాలు పాటించటం ద్వారా డిమెన్షియా ముప్పునూ నివారించుకోవచ్చు.
మద్యం పరిమితం: మితిమీరి మద్యం తాగటం వల్ల అధిక రక్తపోటు, పక్షవాతం, కాలేయ జబ్బులు మాత్రమే కాదు.. డిమెన్షియా కూడా రావొచ్చు. మద్యం అధికంగా తాగితే మెదడు క్షీణించే అవకాశముంది. ఇది ముందుగానే మతిమరుపునకు దారితీయొచ్చు. దీర్ఘకాల మద్యం అలవాటుతో మేధో సామర్థ్యం క్షీణిస్తున్నట్టు, తికమక పడటం వంటివి తలెత్తుతున్నట్టు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మద్యం అలవాటు గలవారు మితిమీరకుండా చూసుకోవటం మేలు.
పొగ మానెయ్యటం: సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటి పొగలో ఎన్నో హానికారక రసాయనాలుంటాయి. ఇవి మెదడుకూ హాని చేస్తాయి. పొగతాగేవారికి డిమెన్షియా ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. అయితే మంచి విషయం ఏంటంటే.. పొగ మానేస్తే ఈ డిమెన్షియా ముప్పు సైతం తగ్గుతుండటం. కాబట్టి వీలైనంత త్వరగా మద్యం అలవాటును మానుకుంటే ఉత్తమం.
ఒంటికి శ్రమ: వ్యాయామం మూలంగా మెదడు సైతం బలం పుంజుకుంటుంది. వ్యాయామం చేసినపుడు గుండె, కండరాల్లోకి రక్తం.. దాంతో పాటు ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇది డిమెన్షియా ముప్పు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేస్తే మతిమరుపు బారినపడకుండా చూసుకోవచ్చు.
మెదడుకు మేత: శరీరానికే కాదు, మెదడుకూ వ్యాయామం అవసరమే. ఎంతసేపూ సోఫాలో కూలబడి టీవీ చూడటం, ల్యాప్‌టాప్ వంటివి ముందేసుకొని అంతర్జాలంలో విహరిస్తే మెదడూ సోమరిగా తయారవుతుంది. డిమెన్షియా ముప్పూ పెరుగుతుంది. అదే ఆలోచనలకు పదునుపెట్టే పనులతో మెదడు కణాలు, వాటి మధ్య అనుసంధానాలు మెరుగవుతాయి. అందువల్ల పదేకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటి హాబీలను అలవరచుకోవటం మంచిది.
నలుగురితో మాటామంతీ: ఒంటరితనం మూలంగా మెదడులో బీటా అమిలాయిడ్ ప్రోటీన్ (అల్జీమర్స్ కారకం) పోగు పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనప్పుడల్లా నలుగురితో కలవటం, బంధువుల ఇంటికి వెళ్లి రావటం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇది మనసునూ ఉల్లాసపరుస్తుంది.
తగినంత నిద్ర: కంటి నిండా నిద్రపోకపోయినా డిమెన్షియా ముప్పు ముంచుకురావొచ్చు. అల్జీమర్స్ బాధితుల్లో 15% మంది నిద్రలేమి, నిద్రలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం వంటి సమస్యలతో బాధపడుతున్నవారేనని తాజా అధ్యయనం ఒకటి నిగ్గుతేల్చింది. రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే మహిళలకు డిమెన్షియా ముప్పు 36% పెరగటం గమనార్హం. కాబట్టి తగినంత నిద్రపోయేలా చూసుకోవటం, ఏవైనా నిద్ర సమస్యలుంటే చికిత్స తీసుకోవటం, పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని ఎక్కువసేపు నిద్రపోయినా ప్రమాదమే. రాత్రిపూట అతిగా నిద్రపోవటమూ డిమెన్షియా ముప్పు పెరగటానికి దారితీయొచ్చు.