హెయిర్ స్పా వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. మీ కుదుళ్లు బలంగా మారతాయి. నిర్జీవంగా ఉన్న జుట్టు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. స్పాలో భాగంగా చేసే మర్దన వల్ల నరాలపై ఒత్తిడి తగ్గి మెదడుకి విశ్రాంతి అందుతుంది.
జిడ్డుగారే జుట్టుకు కలబంద స్పా
కావలసినవి:
కలబంద గుజ్జు- అరకప్పు
నిమ్మరసం- ఒక టేబుల్ స్పూను
పెరుగు- పావుకప్పు
ఉసిరిపొడి- రెండు టేబుల్ స్పూన్లు
వేడి నీళ్లు- ఓ గిన్నెడు
శుభ్రమైన టర్కీ టవల్- ఒకటి
ఇలా చేసుకోవాలి: కలబంద, పెరుగు, నిమ్మరసం, ఉసిరిపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా టర్కీటవల్‌ని వేడినీళ్లలో ముంచి పిండి తలకు చుట్టుకోవాలి. లేదంటే ఆవిరి కూడా పట్టొచ్చు. పది నిమిషాలయ్యాక కలబంద మిశ్రమాన్ని తలకు పూతలా వేసుకుని షవర్‌క్యాప్ పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత సల్ఫేట్ లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం ప్రతి పదిహేను రోజులకోసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలకు ఆవిరి పట్టడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి. జుట్టు రాలే సమస్య కూడా చాలామటుకూ తగ్గుతుంది. కలబంద జుట్టును మెరిపిస్తుంది. నిమ్మరసం అయితే చుండ్రుసమస్యను నివారిస్తుంది. ఉసిరి జుట్టుకు పోషణ అందిస్తుంది. నల్లగానూ మారుస్తుంది.
పొడిబారిన జుట్టుకి ఆలివ్‌నూనె – గుడ్డు చికిత్స
కావలసినవి:
గుడ్లు- రెండు
ఆలివ్‌నూనె- రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు- పావుకప్పు
మెంతిపిండి- నానబెట్టినది (పావుకప్పు)
వేడివేడి నీళ్లు- ఓ గిన్నెడు
శుభ్రమైన టర్కీ టవల్- ఒకటి
తయారీ: పై పదార్థాలన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. టవల్‌ని వేడినీళ్లల్లో ముంచి, గట్టిగా పిండి తలకు చుట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేయాలి. ఇరవై నిమిషాల తరువాత మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా, పట్టుకుచ్చులా కనిపిస్తుంది.