ఇక కాచుకోండి.. మా దెబ్బ రుచి చూపిస్తాం.. భారత్‌కు ఖాన్ వార్నింగ్

0
55

భారత్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్‌‍లోని జైష్ మహమ్మద్ తీవ్రవాద తండాలపై భారత్ మెరుపుదాడులు చేసి వందల సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా, ఈ దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్నారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిరాజ్ యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై మంగళవారం తెల్లవారుజామున ముజఫరాబాద్ సెక్టార్‌‍లో ఉన్న బాలాకోట్. ఛకోటి తదితర ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు భారీ సంఖ్యలో చనిపోయినట్టు సమాచారం. అలాగే, ఆ సంస్థకు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది.

ఈ దాడులపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘాటుగానే స్పందించారు. భారత దాడి తర్వాత అత్యవసరంగా జాతీయ భద్రతా కమిటీని సమావేశపరసి ప్రస్తుత పరిణామాలపై సమీక్షించారు. నియంత్రణ రేఖను భారత్ ఉల్లంఘించిందని ఈ సందర్భంగా పాక్ అభిప్రాయపడింది. బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని, పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయారని భారత్ చెబుతున్నదంతా అబద్ధమని ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా, భారత ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యపూరితంగా, తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించింది. తమ దేశంలో ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో అందులో లబ్ధి కోసం ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. దీనికోసం ఈ ప్రాంతంలోని శాంతిని, సుస్థిరతను ప్రమాదంలో పడేస్తున్నారు అని ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయపడ్డారు.

“భారత దాడి చేసిన ప్రాంతాలు ప్రపంచానికంతటికీ అందుబాటులో ఉంచుతాం. వాళ్లే క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూసుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ మీడియాను ఆ ప్రదేశాల దగ్గరికి తీసుకెళ్తాం. భారత్ అనవసరంగా ఈ దాడికి పాల్పడింది. దీనికి సరైన టైమ్, ప్లేస్ చూసి పాకిస్థాన్ స్పందిస్తుంది” అని జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం ఇమ్రాన్ అన్నారు.

ఈ ప్రకటనకు అనుగుణంగా పాక్ ప్రజలు, భద్రతా బలగాలు ఎలాంటి పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నాయకత్వం దృష్టికి భారత్ బాధ్యతారాహిత్యాన్ని తీసుకెళ్లాలని ఇమ్రాన్ నిర్ణయించారు. మరోవైపు, ఇండో-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటు భారత్ కూడా సరిహద్దుల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. అలాగే, సరిహద్దుల వెంబడి ఉన్న ఎయిర్‌బేస్‌ల వద్ద భారీ సంఖ్యలో సైన్యాన్ని మొహరించింది.