బన్నీ – త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్టు… మరో హిట్ ఖాయం…

0
78

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో చిత్రంరానుంది. ఇప్పటికే, జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో చిత్రం రానుంది.

నిజానికి అల్లు అర్జున్‌కు సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత సరైన హిట్ లేదు. ఈ మధ్యనే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమాతో డిజాస్టర్‌ను చవిచూశాడు. ఈ చిత్రం విడుదలై కూడా ఒక యేడాది కావొస్తోంది. ఇపుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నారు.

ఈ ప్రకటన బయటకు వచ్చి చాలా కాలం అయింది కానీ ఇంకా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది. ‘డీజే’ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమాకు సంగీతాన్ని అందించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.