ఐదు రోజులు.. నీళ్లు తాగి.. అంధకారంలో గడిపిన చిన్నారి..

0
59
small kid
small kid

ఐదు రోజుల పాటు ఏడేళ్ల చిన్నారి ఊపిరి బిగపట్టుకుని తాళం వేసిన గదిలో కాలం వెళ్లదీసింది. తాళం వేసిన ఇంట్లో నీళ్లు తాగుతూ ప్రాణాలు కాపాడుకుంది. ఇంటి యజమాని వచ్చి చూసే వరకు దీన స్థితిలోనే ఉంది. ఈ ఘటన నారాయణ పేట్ జిల్లా మక్తల్ పట్టణంలోని యాదవ్ నగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సురేష్ మహాదేవమ్మ దంపతుల కూతురు అఖిల. ఏడేళ్ల ఈ చిన్నారి 5 రోజుల నుండి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు స్థానిక పోలీసులు. అనుమానం ఉన్న ప్రతి చోటా వెతికారు. కనబడిన వారందరినీ ఆరా తీసారు. ఎక్కడ గాలించినా ఆచూకీ దొరకలేదు. తీరా పక్కింట్లోనే చిన్నారి లభ్యం కావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

సురేష్ ఇంటి పక్కనే టీచర్‌ శ్రీనివాస్ రావు ఇల్లు ఉంది. ఐదు రోజుల క్రితం ఇంటి పైకి ఎక్కి ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదావశాత్తు రేకు విరిగి పక్కింట్లో పడింది. అప్పటికే శ్రీనివాస్‌ రావు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ వెళ్లడంతో ఈ ఐదు రోజులు చిమ్మచీకట్లోనే ఉండిపోయింది.

ఇలా ఐదు రోజులు గడిచింది. చివరికి ఇంటి యజమాని హైదరాబాదు నుంచి తిరిగొచ్చి చూసే సరికి, తప్పిపోయిందనుకున్న అఖిల పక్కింట్లో కనిపించింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు, సన్నిహితులంతా సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.