మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం మెల్‌బోర్న్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో లంక జట్టును చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ప్రపంచకప్ గ్రూప్ ఏ పట్టికలో 8 పాయంట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింటిలోనూ టీమిండియా గెలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఐతే ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయిన శ్రీలంకను.. కెప్టెన్ చమారి ఆటపట్టు ఆదుకుంది. 24 బంతుల్లో 33 రన్స్ చేసి రనౌటయింది. ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. చివర్లో కవీషా దిల్హారి మెరుపులు మెరిపించింది. 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో లంక గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ, శిఖా పాండే, పూనమ్ యాదవ్ తలో వికెట్ సాధించారు.