దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే

0
68

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే, వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం.

అమెరికా, యూరప్‌ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది.