‘అన్నయ్య’ బాటలో ‘తమ్ముడు’.. భీమవరం – గాజువాక స్థానాల్లో పవన్ పోటీ

0
72
Pawan Kalyan
Pawan Kalyan

ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నుంచి ప్రకటన వెలువడింది. నామినేషన్ దాఖలు చేసే రోజును బుధవారం వెల్లడిస్తామని ప్రకటించింది.

నిజానికి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో జనసేన జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అనంతపురం, తిరుపతి, రాజానగరం, భీమవరం, పిఠాపురం, పెందుర్తి, గాజువాక, ఇచ్ఛాపురంలు అగ్రస్థానంలో నిలిచాయి.

ఈ ఎనిమిది స్థానాలపై జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు అంతర్గత సర్వేను నిర్వహించారు. అనంతరం భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేయాలని పవన్ కు సూచించారు. వారి సూచన మేరకు ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు.

మరోవైపు, పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలు ఖరారు కావడంతో అక్కడ తెలుగుదేశం, వైకాపా, బీజేపీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాజువాక నియోజకవర్గంలో టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు, వైసీపీ తరపున టి.నాగిరెడ్డి పోటీ చేస్తుంటే, బీజేపీ తరపున ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పులవర్తి రామాంజనేయులు, వైసీపీ తరపున గ్రంధి శ్రీనివాస్, బీజేపీ తరపున అభ్యర్థిని ప్రకటించాల్సి వుంది.