బైకు ఎక్కేందుకు నో చెప్పింది.. అంతే కత్తితో పొడిచేశాడు.. పెళ్లి పీటలపై..?

0
59
Crime a Girl
Crime a Girl

బైకుకు ఎక్కేందుకు నిరాకరించిన యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆ యువతి తిరిగి రానిలోకాలకు వెళ్ళిపోయింది. బైకు ఎక్కేందుకు నిరాకరించిందని యువతిని పబ్లిక్‌గా కత్తితో పొడిచి చంపేశాడు. గుజరాత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

తన బైక్ ఎక్కేందుకు నిరాకరించిన 19 ఏళ్ల దళిత యువతిని అందరూ చూస్తుండగా దారుణంగా పొడిచి చంపిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా బావ్లా పట్టణంలో జరిగిందీ దారుణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో రెండు వారాల్లో బాధిత యువతి మిట్టల్ జాదవ్ వివాహం జరగాల్సి ఉంది. తన సోదరితో కలిసి బస్టాప్ సమీపంలో షాపింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

తన స్నేహితులైన శ్రవణ్, ధన్‌రాజ్‌లతో కలిసి వచ్చిన కేతన్ వాఘేలా యువతిని తన బైక్‌పై ఎక్కాల్సిందిగా కోరాడు. మిట్టల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేతన్ అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పలుమార్లు పొడిచాడు.

అనంతరం కత్తి పట్టుకునే అక్కడి నుంచి పరుగులు తీశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి కాసేపటికే ప్రాణాలు విడిచింది. యువతి తండ్రి రమేశ్ జాదవ్ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.