పెళ్లీపేరంటాలూ వ్రతాలూనోములూ… వేడుక ఏదయినాగానీ అలంకరణ అనివార్యమైన రోజులివి. ఇంకా చెప్పాలంటే ఇది డిజైనర్ల కాలం. పెళ్లి పీటల నుంచి పెళ్లికూతురు చేతిలోని కొబ్బరిబోండందాకా అన్నింటినీ తమదైన ప్రత్యేక డిజైన్లతో అద్భుతంగా అలంకరించి తీరాల్సిందే. అందులోభాగంగానే ఒకప్పుడు కాగితం పొట్లంగానో చిన్న ప్యాకెట్ రూపంలోనో ఉండే పసుపూకుంకుమా కూడా నేడు చూడముచ్చటైన బొమ్మల రూపంలో అందంగా ముస్తాబవుతోంది.
శ్రావణమాసం… పెళ్లిళ్లూ నోములూ వ్రతాలూ పండగలతో సందడే సందడి. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతాన్ని జరుపుకుంటారు. వరాలిచ్చే వరప్రదాయని కాబట్టి లక్ష్మీదేవిని ఈ రోజున వరలక్ష్మీదేవిగా కొలిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఇంటికి వచ్చిన పేరంటాళ్లకి వెళ్లేటప్పుడు తమ శక్తి కొద్దీ చీర లేదా జాకెట్టు పెట్టి పసుపూ కుంకుమతో పాటు ఆకూవక్కాపండ్లతో కూడిన తాంబూలాన్ని ఇవ్వడం సంప్రదాయం. ఈమధ్య చీరాజాకెట్లకి బదులు కొందరు ఏదో ఒక వస్తువుని కానుకగా ఇవ్వడమూ పెరిగింది. వరలక్ష్మీ వ్రతంతోబాటు ఇతరత్రా నోముల సమయంలోనూ పెళ్లిళ్లలోనూ కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంటారు. అలాగే అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపేటప్పుడు చీరసారెలతో పంపడం ఆచారం. అయితే తాంబూలం లేదా కానుక ఏదయినాగానీ అందులో పసుపూకుంకుమ ప్యాకెట్లని వేయడం, చుట్టపక్కాలకి పంచే సారెలోనూ పసుపూ కుంకుమలను పంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ పసుపూకుంకుమల్ని పొట్లాలూ ప్యాకెట్లకి బదులు రకరకాల బొమ్మల రూపంలో ఇచ్చే ట్రెండ్ మొదలైంది.
మొదట్లో చిన్న ప్లాస్టిక్ ఆకులో రెండు డబ్బాల రూపంలో ఉండేవి కాస్తా రోజురోజుకీ కొత్త అందాల్ని సింగారించుకుంటున్నాయి. బుట్ట, ఆల్చిప్ప, టెడ్డీబేర్, కుండ, నెమలి, పాపాయి, బ్యాగు, రాధాకృష్ణులు, అమ్మాయి, పువ్వు, పిట్ట, ఉంగరం, ఇల్లు… ఇలా ఒకటనేముంది… కాదేదీ ప్యాకింగ్‌కి అనర్హం అన్నట్లు అన్ని రకాల రూపాలతోనూ పసుపూకుంకుమల ప్యాకెట్లని రూపొందిస్తున్నారు నేటి డిజైనర్లు. అందులో కూడా ఒకరిని మించి మరొకరు సృజన కనబరుస్తూ వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రంగుల చమ్కీవస్త్రాలూ లేసులూ పూసలతో అలంకరించే ఈ అందాల ప్యాకింగుల్లో తమకిష్టమైనవాటిని ఎంచుకుని మరీ పంచుతోంది నేటి మహిళాలోకం. చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉండే ఆ బొమ్మలకు తగిలించిన పసుపూ కుంకుమల్ని విడిగా తీసి వాడుకుని, మిగిలిన బొమ్మలతో ఏకంగా ఓ మినియేచర్ షోకేసునీ రూపొందించేస్తున్నారు కొందరు సృజనశీలురు. బాగున్నాయి కదూ!