ముంచుకొస్తున్న ఫణి… తీర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్

0
55

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా దాదాపు 275 కి.మీ. దూరంలో ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 17 కి.మీ. వేగంతో పయనిస్తున్నదని, శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో పూరీ సమీపాన బ్రహ్మగిరి సమితి బలుకుండో వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

దీంతో ఒడిషా గడగడలాడిపోతోంది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 185 నుంచి 205 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమున్నదని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్సార్సీ) బీపీ సేథీ తెలిపారు. ఒడిశాలోని పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపర, బాలాసోర్, భద్ర క్, గంజాం, ఖుర్దా, జాజ్‌పూర్, నయాగఢ్, కటక్, గజపతి, మయూర్‌భంజ్, ధేంకనల్, కియోంజార్ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండవచ్చని చెప్పారు.

తుఫాన్ సన్నద్ధతలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం సాయంత్రం సమీక్ష జరిపారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులను తరలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సహాయ కేంద్రాలకు తరలించిన వారికి ఆహారాన్ని అందించేందుకు ఉచిత వంటశాలలను ప్రారంభిస్తున్నామన్నారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విమానాల ద్వారా జారవిడిచేందుకు లక్షకుపైగా డ్రైఫుడ్ ప్యాకెట్లను సిద్ధం చేశామని చెప్పారు. విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు త్రివిధ దళా ల సిబ్బందితోపాటు తీరరక్షకదళ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఏఎఫ్ (ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్), అగ్నిమాపక సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేందుకు నావికాదళం సహ్యాద్రి, రణ్‌వీర్, కడ్మట్ నౌక లను తీరానికి సమీపంలో నిలిపింది. వైద్య బృందాలు, ఔషధాలు అందులో ఉన్నాయని నేవీ అధికార ప్రతినిధి డీకే శర్మ తెలిపారు.

మరోవైపు, ఫణి తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంత మండలాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను కాస్తా సూపర్ సైక్లోన్‌గా మారటంతో శ్రీకాకుళం జిల్లాపై పెను ప్రభావమే చూపించబోతోంది. ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో 130 నుంచి 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 200 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి.

మరోవైపు విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. వజ్రపు కొత్తూరు ,పలాస, మందస మండలాల్లో గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని మండలాల్లో ముందుస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో కొన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది. మరోవైపు ఈ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా పడటంతో గురువారం రాత్రి నుంచే భువనేశ్వర్, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులను అధికారులు మూసివేశారు.