ఫ్యాను గాలిలో పడిలేచిన నేత కేశినేని. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈయనతో పాటు.. మరో ఇద్దరు నేతలు ఉన్నారు. వారిలో ఒకరు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కాగా, మరొకరు శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు. ఈ ముగ్గురు మాత్రమే జగన్ సునామీని తట్టుకుని విజయబావుటా ఎగురవేశారు.
అయితే, విజయవాడలో ఇపుడో టాక్ వినిపిస్తోంది. కేశినేని నాని ఇపుడ సైకిల్ దిగి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఈయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఢిల్లీలో మకాం వేసి.. ఢిల్లీ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ముఖ్యంగా, ఇటీవల గుంటూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనార్టీ ముస్లిం నేతలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు గెలిచిన ఓడిన నేతలంతా హాజరయ్యారు. కానీ, కేశినేని నాని మాత్రం దూరంగా ఉన్నారు. ఈయన పార్టీ అధినేత ఇచ్చిన ఇఫ్తార్ విందును సైతం పక్కనబెట్టి ఢిల్లీకే పరిమితమయ్యారు.
దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని పార్టీ నేతలు ఎక్కడా కూడా బహిరంగంగా చర్చించుకోవడం లేదు గానీ, కేశినేని నాని పరిస్థితి ఏంటి అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. మొత్తంమీద 25 మంది టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఇందులో ఒక ఎంపీ సైకిల్ దిగిపోయేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం టీడీపీని కలవరపెడుతుంది.