జాడ లేని వాన

0
62

385 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు
జూన్‌ సగటు వర్షపాతం రాష్ట్ర లోటు 35 శాతం
కురవాల్సింది 132 మి.మీ.లు..  కురిసింది 86.2 మి.మీ.లు
పొడి వాతావరణంతో సేద్యం నత్తనడక
నేడు, రేపు వర్షాలకు అవకాశం?

 

వానదేవుడు ముఖం చాటేయడంతో జూన్‌లో రైతులకు నిరాశే మిగిలింది. నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా రావడంతో వర్షపాతం లోటు తీవ్రస్థాయికి చేరింది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతస్థాయిలో తెలంగాణలో జూన్‌ నెల సగటు వర్షపాతం లోటు 35 శాతంగా నమోదైంది. ఇంతకుముందు 2014 జూన్‌లో అతి తక్కువగా 54.2 మిల్లీమీటర్లు(మి.మీ.) కురిసింది. తిరిగి ఈ ఏడాది జూన్‌ సాధారణ వర్షపాతం 132 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 86.2 మి.మీ.లే రాష్ట్రంలో కురిసింది. రాష్ట్రస్థాయి వర్షపాతం లోటు 35 శాతమే కనిపిస్తున్నా… జిల్లాల వారీగా చూస్తే 16 జిల్లాల్లో 35 శాతం కన్నా ఎక్కువ లోటు ఏర్పడింది. రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం లోటు ఖమ్మం జిల్లాలో 73 శాతముంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో ఇంత ఎక్కువ లోటు ఉన్న జిల్లా ఇదే కావడం గమనార్హం. ఈ జిల్లాలో జూన్‌ నెల సాధారణ వర్షపాతం 130.5 మి.మీ.లకు గాను 35.2 మి.మీ.లే కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం వర్షపాతం లోటు 20 శాతానికి మించితే అక్కడ వర్షాభావం తీవ్రంగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఇలా 20 జిల్లాల్లో 20 శాతానికి మించి లోటు ఉంది. మొత్తం 385 మండలాల్లో 20 శాతానికి పైగా వర్షపాతం లోటు ఏర్పడింది. ఈ లోటు 60 శాతానికి మించితే అక్కడ కరవు పరిస్థితులున్నట్లు నిబంధనలున్నాయి. మొత్తం 115 మండలాల్లో వర్షపాతం లోటు 60 నుంచి 99 శాతం వరకూ ఉంది. కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. వరి నార్లు ఇంకా చాలా మంది రైతులు పోయలేదు. జూన్‌ దాటినా చెరువులు, కుంటలు, బోర్లలో నీటి మట్టాలు పెరగలేదు.

వాయుగుండంగా అల్పపీడనం…
బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. మంగళవారంకల్లా ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌పై 3100 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో సోమవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 364 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా పాత ఎల్లాపూర్‌లో 60.3, ఆర్నకొండలో 48, వెదురుగట్టులో 46.5, రుద్రంగిలో 45, కథలాపూర్‌లో 42, జగిత్యాల, ఆసిఫ్‌నగర్‌లలో 39.8, పైదాలో 38.5, జగ్గాసాగర్‌లో 37.8, హబ్షీపూర్‌లో 35, భద్రాచలంలో 34, ఎలిగేడులో 33.3 మి.మీ.ల వర్షం కురిసింది. వర్షాల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరిగింది. జూన్‌లో తక్కువ కురిసినా జులైలో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.