రివ్యూ:దొరసాని కథేంటంటే ఎలా ఉందంటే?

0
136
చిత్రం: దొరసాని
నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక, కిషోర్‌ కుమార్‌, వినయ్‌ వర్మ, బైరెడ్డి వంశీ కృష్ణారెడ్డి, శరణ్య ప్రదీప్‌ తదితరులు
సంగీతం: ప్రశాంత్‌ విహారి
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌
దర్శకత్వం: కేవీఆర్‌ మహేంద్ర
బ్యానర్‌: బిగ్‌ బెన్‌ సినిమాస్‌
విడుదల తేదీ: 12-07-2019

తెలుగు తెరపై ఎన్నో రకాల ప్రేమకథలు వచ్చాయి. కొన్ని సుఖాంతాలైతే, మరికొన్ని విషాదాంత ప్రేమ కథలు.. ఇంకొన్ని హృదయాన్ని కదిలించే ప్రేమకథలు. ఇలా ఒక్కో ప్రేమకథా ఒక్కోలా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరో ప్రేమకథ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ, జీవితా-రాజశేఖర్‌ల కుమార్తె శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘దొరసాని’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆనంద్‌ దేవరకొండ-శివాత్మిక ఎలా అలరించారు?

కథేంటంటే: 30 ఏళ్ల కిందట జరిగిన కథ ఇది. యథార్థ సంఘటనలు తీసుకున్నానని దర్శకుడు ముందే చెప్పారు. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో సాగే కథ ఇది. పట్టణంలో చదువుకుని వచ్చిన రాజు (ఆనంద్‌ దేవరకొండ) దొరసాని దేవకి(శివాత్మిక)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రాజు కవిత్వానికి దేవకి కూడా ప్రేమలో పడిపోతుంది. కానీ, ప్రతి ప్రేమకథలాగానే ఈ ప్రేమకూ ఆస్తులు, అంతస్తులు, కులం, పరువు అడ్డుగోడలుగా నిలుస్తాయి.  వాటిని ఈ ప్రేమ జంట ఎలా ఛేదించింది? చివరికి రాజు, దేవకిల కథ ఎలా ముగిసింది? అనేదే ‘దొరసాని’ చిత్రం.

ఎలా ఉందంటే: ఒక పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య కొన్ని వందల కథలు నడిపారు తెలుగు దర్శకులు. వాటిల్లో ఇదొకటి. ఇదివరకు చూడని కొత్త విషయం ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ నేపథ్యంగా నడిపించడం. 30 ఏళ్ల కిందటి తెలంగాణ పరిస్థితులు.. దొరల చేతుల్లో నలిగిపోతున్న జీవితాలు.. నక్సలిజం ప్రభావం.. వాటి మధ్య చిగురించిన ప్రేమకథ ‘దొరసాని’. కథను వీలైనంత వాస్తవ పరిస్థితులకు దగ్గరగా తీయాలని దర్శకుడు ప్రయత్నించారు. అందుకే ఎక్కడా సినిమాటిక్‌ మెరుపులు కనిపించవు. ప్రతి పాత్రనూ, ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ఓ పేదింటి అబ్బాయి దొరసాని మనసును ఎలా గెలుచుకున్నాడు.. వాటి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా, కవితాత్మకంగా చూపించగలిగారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న లొకేషన్లు కూడా దోహదపడ్డాయి. ఎక్కడా సెట్టింగ్‌లు వేసినట్లు కూడా అనిపించలేదు. ఇప్పటి తెలంగాణలోని మారుమూలు పల్లెలను ఎంచుకుని షూటింగ్‌ చేయడం వల్ల 30 ఏళ్ల నాటి వాతావరణం తెరపై ప్రతిబింబించింది. దర్శకుడు ఈ కథ ద్వారా కొత్త విషయమేమీ చెప్పలేదు. అందుకే ఉన్న చిన్న కథను, రెండున్నర గంటల సుదీర్ఘ ప్రేమ కావ్యంగా చూపించడానికి ప్రయత్నించారు. కథ ఒకే చోట గిరిగీసుకుని కూర్చొవడం వల్ల కాస్త విసుగు తెపిస్తుంది. విరామం వరకూ ఇద్దరూ చూసుకుంటూనే ఉంటారు. అంతకు మించి ఒక్క అంగుళం కూడా కదలదు.

ద్వితీయార్ధంలో కథ గాడిన పడింది. ప్రేమికుల మధ్య విరహం, ఎడబాటు, వారి ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు.. ఇవన్నీ ప్రేక్షకులను అలరిస్తాయి. పతాక సన్నివేశాలు గుండె బరువెక్కెలా సాగుతాయి. ఇటీవల జరిగిన కొన్ని పరువు హత్యలను దర్శకుడు ప్రేరణగా తీసుకుని కథ రాసుకున్నారేమో. ఈ చిత్రాన్ని అలాగే ముగించారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమ.. ధనిక, పేద ఛేదించలేకపోతోందని, పెద్దవాళ్లు చిన్న వాళ్ల ప్రేమను ఆశీర్వదించాలని దర్శకుడి మనోభావం ఈ చిత్రంతో ఆవిష్కృతమవుతుంది.

ఎవరెలా చేశారంటే: విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండకు ఇదే తొలి చిత్రం. చాలా బరువైన పాత్రను సమర్థంగా పోషించారు. తొలి చిత్రమే అయినా, ఎక్కడా తడబాటు లేదు. తన గొంతు కూడా విజయ్‌ దేవరకొండ గొంతును పోలి ఉండటం వల్ల తెరపై అతన్ని చూసినట్లు అనిపిస్తుంది. దేవకి పాత్రకు శివాత్మిక వందశాతం న్యాయం చేశారు. లుక్స్‌ పరంగా ఆకట్టుకున్నారు. ఆమెకు మాట్లాడే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో ఇచ్చారు దర్శకుడు. కీలకమైన పాత్రలో కిషోర్‌ రాణించారు. దాదాపు 60మంది కొత్త వాళ్లను పరిచయం చేసిన చిత్రమిది. ప్రతి పాత్ర అత్యంత సహజసిద్ధంగా తీసుకురాగలిగారు. సాంకేతికంగా చూస్తే కథలో పెద్దగా వైవిధ్యం లేదు. కాకపోతే ఎంచుకున్న నేపథ్యం కొత్తగా ఉంది. సంభాషణల్లో కవితాత్మక భావనలు ఆకట్టుకుంటాయి. 1980నాటి వాతావరణాన్ని తెరపై బాగా తీసుకురాగలిగారు. నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. దర్శకుడిలో ప్రతిభ ఉంది. కాస్త వైవిధ్యమున్న కథలు ఎంచుకుంటే, ఆ ప్రతిభ మరింతగా వెలుగులోకి వస్తుంది.