పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

0
44

అమరావతి: పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించనుంది. మధ్యతరగతి కుటుంబాలకూ దీన్ని వర్తింపజేయనున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆయన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవల విస్తరణను ప్రస్తావించారు. మాజీ సీఎం దివంగత వైఎస్‌ ప్రవేశపెట్టిన ఈ పథకాలు అనేక రాష్ట్రాలు అనుసరించాయని చెప్పారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, గిరిజన ఆరోగ్యం, కిడ్నీ రోగులకు సంబంధించి బడ్జెట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

 ఆరోగ్యశ్రీకి పూర్వ రూపు తీసుకొస్తామని బుగ్గన తెలిపారు. పేద వారికే పరిమితమైన ఈ పథకాన్ని మధ్యతరగతి వారికీ వర్తించేలా  రూ.5లక్షలలోపు కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికీ వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఖర్చలు రూ.వెయ్యి మించిన అన్ని కేసులనూ ఈ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితీ లేకుండా అన్ని కేసులకూ చికిత్స అందిస్తామని వివరించారు.
 సరిహద్దు జిల్లాల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాల్లోని మంచి ఆస్పత్రులను ఈ పథకం జాబితాలో చేరుస్తామని తెలిపారు. అన్ని రోగాలు, సర్జరీలను దీని కింద తీసుకొస్తున్నట్లు చెప్పారు.
 మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని, మొత్తంగా ఈ పథకం కోసం రూ.1740 కోట్లుకేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు.

  ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోపే 108 సేవలు అందే విధంగా ప్రతి మండలంలో అంబులెన్సులు ఉండేలా చూస్తామని తెలిపారు. 432 అదనపు అంబులెన్సుల కోసం రూ.143.38 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.
  104 సేవల విస్తరణలో భాగంగా 676 వాహనాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని, అందుకోసం రూ.179.76కోట్లు ఖర్చు చేయనున్నట్లు బుగ్గన తెలిపారు.
 కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
  రూ.66 కోట్లతో ప్రాథమిక వ్యయంతో పాడేరు/అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. పల్నాడులో సేవల కోసం గురజాల వద్ద ఒకటి, ఉత్తరాంధ్రలో సేవల కోసం విజయనగరంలో వైద్య కళాశాలలను నెలకొల్పాలని యోచిస్తున్నామని, ఇందు కోసం రూ.66 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
 శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం రూ.50 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు.
 వెయ్యికి 74గా ఉన్న ప్రసూతి మరణాల రేటును 55కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. శిశు మరణాలను 32 నుంచి 22కి తగ్గించాలని యోచిస్తున్నామని తెలిపారు.