ఇంటర్నెట్‌డెస్క్: సినిమా, పాత్రలను బట్టి ఒక్కో హీరోకు ఒక్కో రెమ్యునరేషన్ ఉంటుంది. ‘2.ఓ’కు రజనీకాంత్ ఏకంగా రూ.16కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. మరి ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా. రూ.524కోట్లు. అవును! మీరు విన్నది నిజమే. అతనే హాలీవుడ్ నటుడు క్రిస్ హ్యామ్స్‌వర్త్. అదేనండీ మన సూపర్‌హీరో థోర్. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే టాప్-100 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో 76.4మిలియన్ డాలర్లతో క్రిస్ హ్యామ్స్‌వర్త్ 24వ స్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ 66మిలియన్ డాలర్లతో ఉండగా, అవెంజర్స్‌లో రాకెట్ పాత్ర పోషించిన బ్రాడ్లీ కూపర్ 57మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. అతని తర్వాత స్కార్లెట్ జాన్సన్ 56మిలియన్ డాలర్లు, క్రిస్ ఇవాన్స్ 43.5 మిలియన్ డాలర్లు, పాల్ రుడ్ 41 మిలియన్ డాలర్లతో ఉండటం విశేషం. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి సంబంధించి టాప్-6లో అవెంజర్స్ స్టార్స్ ఉండటం విశేషం. వీరిందరి సంపాదన కలిపితే 340 మిలియన్ డాలర్లు.
‘డౌనీ జూనియర్, జాన్సన్‌లాంటి నటులకు విపరీతమైన డిమాండ్ ఉంది. పలు సినిమాల కోసం నిర్మాతలు వీరితో ఏకంగా ప్యాకేజీల రూపంలో మాట్లాడుకుంటున్నారు. వారికున్న క్రేజ్ దృష్ట్యా పెద్ద మొత్తం ఇచ్చేందుకు సైతం ముందుకు వస్తున్నారు’ అని ఫోర్బ్స్ తన నివేదికలో తెలిపింది.