దిల్లీ: కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తి. ఆపరేషన్ విజయ్‌కి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్ దివస్‌ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్ వేదికగా.. ఆనాటి అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.‘‘కార్గిల్ దివస్.. కార్గిల్ యుద్ధంలో భారత సేనలు ప్రదర్శించిన అసమాన వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజు. ఈ సందర్భంగా.. దేశ రక్షణ కోసం తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. ఆ అమరులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అని కోవింద్ ట్విటర్ వేదికగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి తన అనుభవాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సేనలను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం లభించింది. అప్పట్లో నేను జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాను. సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే ‘మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ఆనాటి వీరులందరికీ నా వినయపూర్వక శ్రద్ధాంజలి’ అంటూ నివాళులర్పించారు.
* కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరులను నివాళులర్పించారు. అలాగే సైనిక ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు సైతం స్మారకం వద్దకు చేరుకొని వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
* జమ్ముకశ్మీర్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా అమరులకు నివాళులర్పించారు. అనంతరం రావత్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం తమకు అప్పగించే ఏ పనినైనా నిర్వర్తించేందుకు భారత దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు. అలాగే ఆయుధాల ఆధునీకకరించడంపై దృష్టి సారించామని తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ద్రాస్‌కు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే కొన్ని వైమానిక విన్యాసాలను సైతం నిలిపివేశారు.