అఫ్రిదీకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన గంభీర్‌

0
65

జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ సోమవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ వ్యతిరేకించాడు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఐరాస తీర్మానం ప్రకారం.. మనందరిలాగే కశ్మీరీ ప్రజలకు ప్రాథమిక హక్కులను ఇవ్వాల్సిందే. అసలు ఐరాస ఎందుకుంది? ఇప్పుడెందుకు నిద్రపోతోంది? మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో నేరాలు, స్వయం ప్రతిఘటనలు జరుగుతున్న విషయాన్ని గుర్తించాలి. అగ్రరాజ్య అధినేత ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి’ అని నోరు పారేసుకున్నాడు.

ఇందుకు భారత మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ దీటుగా సమాధానమిచ్చాడు. ‘అఫ్రిదీ ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. ఈ విషయాన్ని తెలిపినందుకు అతడిని అభినందించాలి. అయితే అఫ్రిదీ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇవన్నీ జరుగుతోంది పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే. కాబట్టి ఆందోళన చెందకు. త్వరలోనే అక్కడి పరిస్థితులను కూడా సరిచేస్తాం’ అని తనదైన శైలిలో జవాబిచ్చాడు.

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను మోదీ సర్కారు రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.