శ్రావణమాసం.. ప్రతి ఇంటా లక్ష్మీ కళ!

0
44

శ్రావణ మంగళగౌరీ వ్రతం:

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం విశేషమే. ఆ రోజు మంగళగౌరీ దేవిని మహిళలు అర్చిస్తారు. తన భర్త అయిన శివుడు కాలకూట విషం తాగినా… తన మాంగల్యానికి ఏ ప్రమాదం లేదని నిశ్చయంగా ప్రకటించిన దేవత మంగళగౌరి. ఆమెకే సర్వ మంగళ అని పేరు. ఈ మాసంలో ప్రతి మంగళవారం రోజు మహిళలు ఈ మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. ముఖ్యంగా నవ వధువులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. వ్రతం రోజు మహిళలు పూజావేదికపై మంగళగౌరిని ప్రతిష్ఠించి, చేతికి తోరాలు కట్టుకుంటారు. వ్రతకథను విని తోటి ముత్తయిదువులకు శెనగలు, చలిమిడి  పండు తాంబూలం వాయినంగా ఇస్తారు.

శుక్రవారం… వరలక్ష్మి వ్రతం:

శ్రవణా నక్షత్రం శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం. ఈ నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమైన శ్రావణం చాలా శుభప్రదం. ఈ మాసంలో రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం ఆచరించడం సంప్రదాయం. పౌర్ణమి ముందు వచ్చే ఈ శుక్రవారం విశేషమైందని చెబుతారు. పురాణాల ప్రకారం చారుమతికి కలలో కనిపించి వరలక్ష్మీదేవి ఈ వ్రతవిధానాన్ని ఉపదేశించింది. కొత్తకోడలికి అత్తవారు ఈ శ్రావణమాసంలో ఇచ్చే కానుకను ‘శ్రావణపట్టీ’ అంటారు. అందులో లక్ష్మీదేవి ప్రతిమ(రూపు) ఉంటుంది. ఆ బంగారు ప్రతిమను పూజావేదికపై అమర్చుకొని, కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పిండివంటలు, శెనగలు, చలిమిడి, పాయసం ఎంతో ప్రీతితో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. చారుమతీ వృత్తాంతం ప్రధానాంశంగా గల వ్రతకథను విని, ముత్తయిదువలకు వాయినాలు ఇస్తారు.

రాఖీ పౌర్ణమి:

మహావిష్ణువు హయగ్రీవరూపంలో అవతరించిన పర్వదినం శ్రావణ పౌర్ణమి. ఆ సంవత్సరమే ఉపనయనం అయిన వటువులకు ఈ పూర్ణిమనాడు ఉపాకర్మ నిర్వహిస్తారు. విద్యాభ్యాస శుభారంభ పర్వదినం ఇది. నూతన యజ్ఞోపవీతధారణ కూడా ఆ రోజే. లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం హయగ్రీవుని అనుగ్రహంతో కలుగుతుంది. అందుకే ఈ రోజు మహావిష్ణువును.. విశేషంగా హయగ్రీవ రూపంలో ఆర్చించే సంప్రదాయం ఉంది. వేదరూపుడైన దత్తాత్రేయుణ్ని, వేదమాత గాయత్రీదేవిని అర్చించే విధానమూ ప్రచారంలో ఉంది.  సోదరీ సోదరుల ప్రేమకు సంకేతంగా నిర్వహించే రాఖీ పండగ కూడా ఇదే రోజు.

శ్రీకృష్ణాష్టమి :

శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి నాడు దేవకీవసుదేవులకు శ్రీకృష్ణుడు పుత్రుడుగా జన్మించాడని భాగవతం చెబుతోంది. ఈ పర్వదినాన్ని కృష్ణాష్టమిగా చేసుకుంటారు. దీనినే గోకులాష్టమి, జన్మాష్టమిగా పిలుచుకుంటారు. ఈ రోజు శ్రీకృష్ణుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి, పాలు, పెరుగు, వెన్న మొదలైనవి నివేదన చేస్తారు. మరో సంప్రదాయం ప్రకారం బాలింతలకు పెట్టే పదార్థాన్ని స్వామికి నివేదన చేస్తారు. వేయించిన మినపపిండిలో పంచదార కలిపి దీనిని తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో శొంఠి, మిరియం కలిపి బాగా నూరి, బెల్లంతో పాకంపట్టి, తగినంత నెయ్యి కలిపి నైవేద్యం తయారు చేస్తారు. దీనిని ‘కట్టె కారం’, ‘కాయం’, ‘శొంఠి ఉక్కిరి’ ఇలా వేర్వేరు ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఉట్టికొట్టే వేడుకలను సంబరంగా నిర్వహిస్తారు.