కథానాయకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన నటుడు నరేశ్. ఒకప్పుడు కడుపుబ్బా నవ్వించే కామెడీ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. యువ కథానాయకుడు కార్తికేయతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘గుణ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హీరో కార్తికేయతో వచ్చి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా…
ఒకప్పుడు హీరోగా ఎంత పేరు వచ్చిందో.. ఇప్పుడు నటుడిగా అంతే పేరు వచ్చింది? ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారు?
నరేశ్: ‘టైమింగ్ వచ్చే ఆర్టిస్ట్ ఎవడో.. టైమ్ వచ్చే ఆర్టిస్ట్ ఎవడో చెప్పలేం’ అని కోట శ్రీనివాసరావులాంటి పెద్దవాళ్లు అంటుంటారు. టైమ్ ఎప్పుడూ వచ్చి పోతుంటుంది. కానీ, మన టైమింగ్ ఎప్పుడూ పోదు. జంధ్యాలగారి ఆశీర్వాదంతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశా. నాకు ఇద్దరు గురువులు. ఒకరు జంధ్యాల. మరొకరు విజయ నిర్మల. నా కెరీర్‌లో గొప్ప గొప్ప దర్శకులతో చేశా. హీరోగా 80కు పైగా సినిమాలు పూర్తయిన సమయంలో మనసు రాజకీయాలవైపు మళ్లింది. మంచి పనికోసం వెళ్లాను. ఒక నెల రోజులు షూటింగ్ లేకపోతే, షూటింగ్‌లు చేస్తున్నట్లు నాకు కలలు వస్తుంటాయి. ఏదో ఒకటి చేయాలన్న తపన ఇంకా మిగిలిపోయింది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశా. అయితే, ఇదేమీ పూలబాట కాదు. దాదాపు ఆరేడేళ్లు ఒక్క హిట్ అయినా పడదా? అని ఎదురు చూసిన రోజులూ ఉన్నాయి.
మొదటి నుంచి ఆర్టిస్ట్‌గా ఎదగడం వేరు. ఒక హీరో ఆర్టిస్ట్‌గా రావడం అనేది నాకు క్లారిటీ ఉన్నా, నాతో చేసే దర్శకుల తరం మారిపోయింది. ‘ఒకప్పుడు హీరోగా చేసిన ఈయనతో ఏం చేయాలి? కామెడీ చేయించగలమా? సీరియస్ ఫాదర్ క్యారెక్టర్ ఇవ్వాలా?’ అని వాళ్లు ఆలోచించడానికి పదేళ్లు పట్టింది. ఇది చాలా కీలకమైన టైమ్. నాకు అందుకోవడానికి టైమ్ పట్టింది కానీ, ఒకసారి ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత మళ్లీ వెనకడుగు వేయలేదు.
నరేశ్: సినిమా అనేది సముద్రంలో చేపల వేటకు వెళ్లడంలాంటిది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ‘చంద్రవంశం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. అయితే, ఒకరోజు బి.గోపాల్ ఫోన్ చేసి, ‘ఎన్టీఆర్‌కు మామగా చేయాలి. నగ్మా మీకు పెయిర్‌గా ఉంటారు’ అని అడిగారు? చేశాను. సినిమా హిట్. కానీ, నాకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత ‘మీ శ్రేయోభిలాషి’ నటుడిగా నాకు మంచి పేరు వచ్చింది. అది టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ పాత్ర కోసం కొంచెం లావుగా అవ్వాల్సి వచ్చింది. గుండు కూడా చేయించుకున్నా.
ప్రతి తల్లికి నరేశ్‌లాంటి కొడుకు పుట్టాలని విజయ నిర్మల అనుకున్నారా?
నరేశ్: ఆమె కేవలం నాకు తల్లిగా మాత్రమే మిగిలిపోలేదు. ఒక గురువుగా, ఒక స్నేహితురాలిగా, ఆదర్శమూర్తిగా నిలిచారు. కృష్ణగారిని ఒక తల్లిలా చూసుకున్నారు. భార్యగా, స్నేహితురాలిగా ప్రతి సమయంలోనూ అండగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం చాలా కష్టం. అలాంటింది ఆమె మా అన్నదమ్ములందరినీ కలిపారు. ఆమె ఎంతోమందికి సాయం చేశారు. ఎన్నో పెళ్లిళ్లు చేయించారు. మా ఇంట్లో ఐదేళ్లు దాటి పనిచేసిన ప్రతి సర్వెంట్‌కు డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆమెను ప్రోత్సహించిన బాలసరస్వతిగారికి ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చారు. ఇలా చెప్పుకొంటూ పోతే నా తల్లిని నేను పొగుడుతున్నట్లు ఉంటుంది. ఒక మహిళ 46 చిత్రాలకు దర్శకత్వం వహించడం ప్రస్తుత పరిస్థితుల్లో జరగదు.. భవిష్యత్‌లోనూ ఎవరూ చేయలేరు. ఇలాంటి తల్లికి కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. మరో జన్మంటూ ఉంటే ఆమె కడుపునే పుడతా.
మీ తల్లి చనిపోతారని ముందే మీకు తెలిసిందా?
నరేశ్: చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఆమె నడవటానికి ఇబ్బంది పడేవారు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఆమె ఏడ్చేశారు. ‘కృష్ణగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను, ఆయనను ఇబ్బంది పెట్టడమే కాకుండా, మిమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నా’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ రోజు నేను కూడా ఏడ్చేశా. ఆ బాధను పోగొట్టుకోవడానికి అందరితో నవ్వుతూ ఉండేవారు. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకూ ఎంతో ఇచ్చారు. ఒకరోజు నన్ను పిలిచి, ‘నేను ఇబ్బంది పడకుండా భగవంతుడు తీసుకెళ్లిపోయినా.. షిర్డీలో బాబాగారి దగ్గర కుక్కగా పుడతా. నేను గురువారం నాడే చనిపోతా’ అని చెప్పింది. ఆమె ఎలా కోరుకున్నారో అలాగే గురువారం రాత్రి చనిపోయారు. శరీరం దహనం చేయకముందు ఆమె పాద ముద్రలను తీయించాం. వాటికి బంగారు కవచం చేయించా. ఆమె ఫొటో దగ్గర పెట్టుకున్నా. రోజూ బయటకు వెళ్లేటప్పుడు ఆ పాదాలకు నమస్కరించి వెళ్తా. పడుకునే ముందు కూడా దండం పెట్టుకుని పడుకుంటా.