మహిళలకు శుభవార్త ఆపదలో ఉంటే ఈ నంబర్‌కు వాట్సప్‌ చేయండి.

0
64

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 91212 11100 నంబరును అందుబాటులోకి తెచ్చిందని హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మహిళలు ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ నెంబరుకు సమాచారాన్ని వాట్సప్‌ చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళామిత్రల వ్యవస్థను రాష్ట్రస్థాయిలో ప్రారంభించి మాట్లాడారు. ‘మహిళలు నేటికీ పోలీసుస్టేషన్లకు వెళ్లడానికి సంకోచిస్తున్నందున వారికి సేవలందించేందుకు మహిళామిత్రల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాం. రాబోయే రోజుల్లో ఒక్క మీట నొక్కగానే పోలీసులకు సమాచారం వెళ్లే వ్యవస్థను కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ వినియోగంతో మహిళలకు భద్రత తగ్గిపోతోందని, వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వర్చువల్‌ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తామని, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే వాటిని ప్రారంభిస్తామని డీజీపీ గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి ప్రతిపాదించిన ‘మహిళల కోసం వర్చువల్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటు’ ఆలోచనను వెంటనే అమలు చేస్తామన్నారు. మహిళామిత్రలుగా ఉంటూ తోటి మహిళలకు సాయపడాలనుకునేవారు 91212 11100 నంబరుకు వాట్సప్‌ చేసి ఆసక్తిని తెలియజేస్తే శిక్షణ ఇస్తామన్నారు. బాధితులు 112, 181, 100 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చని వెల్లడించారు.