క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను 30 ఏళ్ల క్రితం ముంబయి రంజీ జట్టుకు ఎంపిక చేసిన వ్యక్తే ఇప్పుడు అతడి కుమారుడు అర్జున్ తెందూల్కర్‌ను అదే ముంబయి జట్టుకు సెలక్ట్ చేశాడు. ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ మిలింద్ రేగి అన్నాడు. సచిన్ పాఠశాల స్థాయిలోనే తన బ్యాటింగ్‌తో అనేక రికార్డులు బద్దలుకొట్టి.. 1988 డిసెంబర్‌లో ముంబయి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి ముంబయి చీఫ్ సెలెక్టర్ నరెన్ తమానె లిటిల్‌మాస్టర్ ప్రతిభను గుర్తించి రంజీ జట్టులో అవకాశమిచ్చాడు. ఆ సెలక్షన్ కమిటీలో ముంబయి రంజీ జట్టు మాజీ కెప్టెన్ మిలింద్ రేగీ ఒకరు.
ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో బీసీసీఐ అండర్ 23 విభాగంలో 50 ఓవర్ల విజ్జీ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టు మంగళవారం ప్రకటించిన జాబితాలో అర్జున్ చోటు సంపాదించాడు. 30 ఏళ్ల క్రితం సచిన్‌ను ముంబయి జట్టుకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యుడు మిలింద్ ఇప్పుడు అతడి కుమారుడు అర్జున్‌ను అదే ముంబయి జట్టుకు ఎంపిక చేయడం విశేషం. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైన అర్జున్ ఇప్పటికే తన ప్రతిభని నిరూపించుకున్నాడు.
‘ఇప్పటివరకూ తండ్రీకొడుకులను ఎంపిక చేసిన సెలక్టర్లు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలీదు. యాదృచ్ఛికంగా తెందూల్కర్ విషయంలో నాకు ఈ అవకాశం దక్కింది. బాగా బౌలింగ్ చేసే ఆటగాళ్ల కోసం మేం ఎదురుచూస్తున్నాం. ఇటీవల ఇంగ్లాండ్ ఎంసీసీ సెకండ్ XI తరఫున ఆడిన అర్జున్ 23 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్‌ను గమనించాను. సెలక్టర్లందరూ అతడిని పర్యవేక్షిస్తున్నారు. నేను చీఫ్ సెలక్టర్‌గా కొనసాగేంతవరకు ఏ ఆటగాడిని ప్రత్యేకంగా చూడను’ అని మిలింద్ ఓ ఆంగ్ల పత్రికతో అన్నారు.