కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన అన్షుమన్‌ రాత్‌

0
98

భారత సంతతికి చెందిన అన్షుమన్‌ రాత్‌ హాంకాంగ్‌ జాతీయ క్రికెట్‌ జట్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పేశాడు. మరొకవైపు సెలక్షన్‌కు సైతం అందుబాటులో ఉండనంటూ హాంకాంగ్‌ జట్టు యాజమాన్యానికి స్పష్టం చేశాడు. భారత్‌ తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే హాంకాంగ్‌ జట్టుకు దూరంగా ఉండదల్చుకున్నానని రాత్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు భారత్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. ఏదొక రోజు భారత్‌ తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం హాంకాంగ్‌ జట్టుకు వీడ్కోలు చెప్పినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు.

భారత్‌కు ఆడాలనేదే తన చిరకాల కోరికని పేర్కొన్నాడు. భారత పాస్‌పోర్ట్‌ కల్గిన రాత్‌.. ముందుగా వచ్చే సీజన్‌లో అన్‌క్యాప్డ్‌ ఆటగాడిగా ఐపీఎల్‌ ఆడాలని అనుకుంటున్నాడు.  ఇప్పటివరకూ 15 వన్డేలు ఆడిన రాత్‌ 51.75 సగటుతో ఉన్నాడు. ఇక తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 65 సగటుతో 391 పరుగులు చేశాడు.