మెట్రో స్టేషన్‌లలో రద్దీ..! రోజురోజుకి పెరుగుతున్న ప్రయాణికులు..

0
59

హైదరాబాద్‌ మెట్రో తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. రెండు కారిడార్లలో ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా సోమవారం రాత్రి 8 గంటల వరకు 3 లక్షల మంది ప్రయాణం చేయగా, రాత్రి 11 గంటల వరకు సుమారు 3.80 లక్షల మంది ప్రయాణం చేశారని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సమ్మెకు ముందు సాధారణ రోజుల్లో 3 లక్షల లోపు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3.65 లక్షల నుంచి 3.80 లక్షలకు చేరిందన్నారు. ఇది ఓ రికార్డు అని ఆయన తెలిపారు. రోజు 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళిక ఉండగా, రద్దీ నేపథ్యంలో అదనంగా మరో 100 ట్రిప్పులను నడిపామని తెలిపారు. బస్సుల కొరత, ప్రైవేటు వాహనాల దోపిడీ అధికం కావడంతో నగరవాసులు మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. హైటెక్‌సిటీ, అమీర్‌పేట, ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో స్టేషన్‌లలో రద్దీ ఎక్కువగా ఉందని, రద్దీ పెరుగుతుందన్న అంచనాతో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేశామని మెట్రో ఎండీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె కొనసాగినన్ని రోజులు అదనపు సర్వీసులు నడిపిస్తామని ఆయన వెల్లడించారు.