ప్రపంచంలోనే అతి పొడవైన కొమ్ములు కలిగిన ఆవు ఇదే. హోక్లహోమా (అమెరికా)లోని లాటన్ పట్టణంలో విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆవును ‘బకుల్‌హెడ్’ అని పిలుస్తున్నారు. దీని కొమ్ముల పొడవు 11 అడుగుల 1.8 అంగుళాలు. దీని వయస్సు ఆరేళ్లు మాత్రమే. త్వరలో దీన్ని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కించేందుకు పేపర్ వర్క్ జరుగుతోంది. 2020 సంవత్సరంలో ఇది ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కి ఎక్కుతుందని తెలిసింది. ప్రస్తుతం అలబామాలోని గుడ్‌వాటర్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆవు గిన్నీస్ రికార్డుల్లో కొనసాగుతోంది.
పొంచో వియా పేరుతో పిలుస్తున్న ఆ అవు కొమ్ముల పొడువు పది అడుగుల 7.4 అంగుళాలు. బకుల్‌హెడ్ ఆవు యజమాని టెక్సాజ్‌కు చెందిన 14 ఏళ్ల మార్షియాల గోంజలెస్. సరిగ్గా ఐదున్నర ఏళ్ల కిందట ఈ ఆవును దాని ఏడుగురు బ్రీడర్లు అమ్మకానికి పెట్టగా ఆరు నెలల వయస్సున్న ఆ ఆవును గోంజలెస్ లాటరీ పద్ధతిలో కొనుగోలు చేసింది. అంటే.. ఆమె తరఫున ఆమె తల్లిదండ్రులు దీన్ని కొనుగోలు చేసి ఉంటారు. ప్రస్తుతం ఆ అమ్మాయి సోదరుడు లియాండ్రో ఈ ఆవును దేశమంతా తిప్పుతూ ప్రదర్శన ఇస్తున్నారు. ఏడాదికి 12 నుంచి 15 చోట్ల దీని ప్రదర్శన ఉంటుందని ఆమె సోదరుడు తెలిపారు.