వివాదాస్పద దర్శకుడు ముద్ర పడ్డ రాంగోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో పెద్ద దుమారమే రేపుతున్నాడు. సినిమాకు సంబంధించి ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు,చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇదే క్రమంలో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆర్జీవిపై విమర్శలు చేయడం.. జొన్నవిత్తులపై ఆర్జీవీ ఓ రేంజ్‌లో సెటైర్స్ వేయడం తెలిసిందే. ఆర్జీవీ సెటైర్స్‌పై తాజాగా జొన్నవిత్తుల స్పందించారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ హడావుడి చేస్తున్న వర్మ.. మెగా ఫ్యామిలీ సినిమా తీస్తానని ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గాడని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ మొనగాడు ఫోన్ చేస్తే వెనక్కి తగ్గావని నిలదీశారు. నీకు నిజంగా దమ్ముంటే ‘మెగా ఫ్యామిలీ’ తీసేవాడివి కదా అని మండిపడ్డారు. కమ్మం రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ద్వారా వర్మ రాష్ట్రంలో కల్లోలం రేపుతున్నాడని అన్నారు. సినిమా టైటిల్ మార్చాలన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేయడానికే సినిమా తీసినట్టుగా అర్థమవుతోందన్నారు. ఇక ఇంట్లో వాళ్లు నిన్ను ఎలా భరిస్తున్నారో అంటూ తనపై వర్మ చేసిన విమర్శలపై కూడా జొన్నవిత్తుల స్పందించారు.