ఆర్టీసీ పూర్వ కళను సంతరించుకుంది. విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు..

0
61

డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు 55 రోజుల తర్వాత నేడు విధుల్లో చేరుతున్నారు. బేషరతుగా వారిని విధుల్లో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు డిపోల వద్దకు చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలో కార్మికులంతా విధులకు తరలివస్తున్నారు. దీంతో ఆర్టీసీ పూర్వ కళను సంతరించుకుంది. ఇన్నాళ్లు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడ్డ జనం కూడా.. ఆర్టీసీ కార్మికుల చేరికతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 4వేల మంది కార్మికులు నేడు విధులకు హాజరవనున్నారు. అలాగే ఆదిలాబాద్‌‌లో దాదాపు 3వేలు,నిజామాబాద్‌లో 3వేల మంది కార్మికులు నేడు విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. అటు ఖమ్మం జిల్లాలో సుమారు 2600 పైచిలుకు కార్మికులు విధుల్లో చేరుతారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మానవతా హృదయంతో వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. తక్షణ సహాయం కింద రూ.100కోట్లు కూడా మంజూరు చేశారు. టికెట్‌పై కి.మీకి రూ.20పైసలు పెంచడం ద్వారా ఆర్టీసీకి రూ.780కోట్లు అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ సానుకూల స్పందనపై ఆర్టీసీ కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.