అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై గుజరాత్‌లో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. ట్రంప్ పర్యటనకు గుజరాత్ ప్రభుత్వం రూ.100 కోట్ల ప్రజాధనం వృథా చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని గుజరాత్ అసెంబ్లీలోనూ కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ చేపట్టిన 3 గంటల పర్యటనకు రూ.100 కోట్లు వ్యయం చేయడం సరికాదంటూ మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను గుజరాత్ సీఎం విజయ్ రుపాని కొట్టిపారేశారు. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా మొత్తం రూ.12.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో గుజరాత్ ప్రభుత్వం రూ.8 కోట్లు కేటాయించగా…అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) రూ.4.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనతో గుజరాత్ ప్రజలందరూ గర్విస్తున్నట్లు విజయ్ రుపానీ పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలోని గుజరాతీయులు ఎంతో సంతోషం వ్యక్తంచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

భారత్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 24న అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్…సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి నుంచి మొతెరా స్టేడియం వరకు 22 కి.మీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1.10 లక్షల మంది పాల్గొన్నారు. ట్రంప్ వెంట ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు ఉన్నారు.