టికెట్ తీసుకోమని చెప్పిన ఆర్టీసీ మహిళా కండక్టర్‌‌పై దాడి.

0
52

టికెట్ తీసుకోమని చెప్పిన ఆర్టీసీ మహిళా కండక్టర్‌‌పై దాడి చేసిన ఇద్దరు ఎస్కార్ట్‌ ఏఆర్‌ కానిస్టేబుళ్లు సస్పెండ్‌కు గురైయ్యారు. కానిస్టేబుళ్లు సత్యనారాయణరెడ్డి, రామకృష్ణా గౌడ్‌ అంబర్‌పేట ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్‌ చర్లపల్లి జైలు నుంచి ఒక ఖైదీని గురువారం జడ్చర్ల న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరుగు ప్రయాణంలో వారు కొల్లాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కారు. వారిని మహిళా కండక్టర్‌ టికెట్టు అడగ్గా వారెంటు ఉందని చెప్పారు. వారెంట్ చూపించాలని కండెక్టర్ కోరారు. దీంతో ‘నన్నే టికెట్ ఆడుగుతావా?’ అని ఊగిపోతూ కానిస్టేబుల్ రామకృష్ణ గౌడ్ ఆమెను బూతులు తిట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకున్నాడు.

ఈ ఘటనపై బాధితురాలు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేవలం టికెట్ తీసుకోవాలన్నందుకే తనపై దాడి చేసి గాయపరిచారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ సీపీ అంజనీ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.